అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో.. ప్రధాని మోదీ చర్చలు
భారత్, అమెరికాల మధ్య విశ్వసనీయమైన భాగస్వామ్య బంధం ఉందనీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్లో క్వాడ్ సదస్సులో పాల్గొన్న ఇరువురు నేతలు విడివిడిగా చర్చలు జరిపారు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లేలా మానవాళికి మేలు చేసేలా ఈ మిత్రత్వం కొనసాగతుందని మోదీ అన్నారు. వర్థమాన, స్వేచ్ఛాయుత, అనుసంధానిత, సురక్షితమైన ప్రపంచం కోసం కలిసి పనిచేస్తామని నేతలిద్దరూ ప్రతినబూనారు. ఒకే విధమైన ఆలోచనలు, ఉమ్మడి ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేశాయని మోదీ తెలిపారు. ఇండో పసిఫిక్ అంశంపై ఆలోచన విధానం ఒక్కలాగే ఉందన్నారు.
వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఇరు దేశాల మధ్య బంధం గతంలో కంటే మెరుగైనా ,ఆశించిన స్థాయికి అది ఇంకా చేరుకోలేదన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యాపరా బంధం బలోపేతమవుతుంది. భారత్ తయారీ కార్యక్రమం, ఆత్మనిర్బర్ భారత్ కింద మా దేశానికి వచ్చిన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో అమెరికా పారిశ్రామిక వేత్తలు భాస్వాములు కావాలి అని మోదీ పిలుపునిచ్చారు. చర్చలు ఫలప్రదంగా సాగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లోనే కాకుండా ప్రజల మధ్య సంబంధాల విషయంలోనూ విస్తృతంగా చర్చించుకున్నాం అని అన్నారు.
భారత్, అమెరికా కలిసి చాలా సాధించగలవని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలను ఈ భూగోళం మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాల గురించి తాము చర్చించినట్లు వెల్లడిరచారు. కరోనాను ఎదుర్కోవడంలో చైనా విఫలం కాగా, భారత్ మాత్రం విజయం సాధించిందని కొనియాడారు.













