పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం?
పాక్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చిపడిందని పాక్‌లో పుకార్లు చెలరేగాయి. రెండు రోజుల క్రితం జరిగిన సెనెట్ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పార్టీ తెహ్రీక్ -ఈ- ఇన్సాఫ్’ వెనకబడింది. ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఈ పరిస్థితి వచ్చి పడింది. దీంతో ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్ చేశాయి. గౌరవప్రదంగా ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో పాక్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు గురువారం సాయంత్రం 7:30 నిమిషాలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఏ అంశంపై ప్రసంగిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఆ ప్రసంగంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ పరిణామాల కంటే ముందు ప్రధాని ఇమ్రాన్‌తో పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా, ఇంటెలిజెన్స్ ఐజీ ఫైజ్ హమీద్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ తర్వాతే పాక్ రాజకీయాల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ‘‘ఆయనకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే వెంటనే ప్రధాని పదవి నుంచి వైదొలగాలి. ఈ డిమాండ్ కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే రావడం లేదు. అధికార పక్షం నుంచి కూడా వస్తోంది.’’ అని ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు. సెనేట్ ఎన్నికల్లో ఇమ్రాన్‌కు ఎదురు దెబ్బ తగలడంతో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందేనన్న డిమాండ్ వచ్చింది. దీనికి ఇమ్రాన్ కూడా సిద్ధపడినట్లు సమాచారం. గురువారమే విశ్వాస పరీక్షకు సిద్ధమైనా…. తర్వాత మనసు మార్చుకొని శనివారానికి వాయిదా వేసుకున్నారు.
ఆర్థిక మంత్రి ఓటమి ప్రధాని మెడకు చుట్టుకొంది….
ఇమ్రాన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అబ్దుల్ హఫీజ్ షేక్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ బలపరిచిన మాజీ ప్రధాని యూసఫ్ గిలానీ విజయం సాధించారు. అయితే ఈ సభకు సభ్యులను పరోక్ష పద్ధతిలోనే ఎన్నకునే సంప్రదాయం పాక్‌లో ఉంది. ఆర్థిక మంత్రి ఓడిపోయినా…. మెజారిటీ తమకే ఉందని చూపించుకోడానికి ప్రధాని ఇమ్రాన్ సిద్ధమయ్యారు. అయితే ప్రతిపక్షాలతో పాటు ఆర్మీకి కూడా ప్రధాని ఇమ్రాన్ వ్యవహార శైలి ఏమాత్రం నచ్చడం లేదు. ఇమ్రాన్ పరిపాలనా కాలంలో ఆర్థికంగా దేశం బాగా చిక్కిపోయింది. నిరుద్యోగం తాండవిస్తోంది. వీటితో పాటు ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలను నెరపడం లేదు. చైనా చేతిలో ఇమ్రాన్ కీలు బొమ్మగా మారిపోయారు. వీటన్నింటిని బేరీజు వేసుకొన్న ప్రతిపక్షాలు…. ఈ ఎన్నికల ద్వారా ఆయన్ను ఇరుకున పెట్టాలని భావించింది.
ప్రధానిపై ఆర్మీ తీవ్ర అసంతృప్తి?
ప్రధాని ఇమ్రాన్ వ్యవహార శైలిపై ఆర్మీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. దీన్ని ఇమ్రాన్ ముందే పసిగట్టారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రధాని ఒప్పుకోవడం కూడా ఓ వ్యూహాత్మకమని ఆయన కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో సైన్యంతో సత్సంబంధాలే కొనసాగించారు. ఆ తర్వాత మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఒంటరి కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లాంటి అంశాలు ఇమ్రాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి తీసుకెళ్లాయి. పైగా కోవిడ్. దీంతో దేశ పరిస్థితి దిగజారిపోయిందన్న వార్తలొచ్చాయి. ఇమ్రాన్ ‘బలహీన ప్రధాని’ అన్న ముద్ర వేసుకోడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్మీ చెలరేగిపోవచ్చని ఇమ్రాన్ అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని సైన్యం ఎక్కడ చేతుల్లోకి తీసుకొని సైనిక పాలన విధిస్తుందన్న భయం ప్రధానిలో ఉన్నట్లు టాక్. భారత్‌తో కాస్త సంబంధాలు నెరపి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి, ఆర్మీ వ్యూహాన్ని దెబ్బతీయవచ్చని ప్రధాని భావించారు. అయితే… ఆర్మీ, ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని సాగనివ్వడం లేదని సమాచారం.













