Cheque: భారత రైటర్ కు ఆక్స్ఫర్డ్ బ్లాంక్ చెక్..? ఏంటి ఆ స్టోరీ..?
భారత రచయితలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంటుంది. బ్రిటన్(UK), అమెరికా(United States) సహా పలు దేశాలు మన రచయితలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. అలా ఓ రచయితకు బ్రిటన్ లోని ప్రముఖ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ భారత రచయితకు బ్లాంక్ చెక్ పంపింది. కానీ ఆయన దానిని తిరస్కరించారు. అసలు ఎవరు ఆ రచయిత, ఏంటి ఆ స్టోరీ ఒకసారి చూద్దాం.
భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే రచయితలలో పరమేశ్వరన్ థంకప్పన్ నాయర్ ఒకరు. ‘కోల్‌కతా బేర్‌ఫుట్ హిస్టారియన్’ అని పిలువబడే నాయర్ కోల్‌కతాలో నివసించే రచయిత, స్వతంత్ర పరిశోధకుడు, చరిత్రకారుడు, మలయాళీ రచయిత. 1933లో కేరళలో జన్మించిన నాయర్.. కలకత్తా చరిత్రపై ఆంగ్ల భాషలో విస్తృతంగా రచనలు చేసారు. మొత్తం ఆయన 61 పుస్తకాలను ప్రచురించారు. తాజా పుస్తకం ‘కోల్‌కతాలో గాంధీజీ’. కేరళలోని అల్వే నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత ఆయన కలకత్తా వెళ్ళారు.
1955లో అక్కడికి వెళ్ళిన నాయర్.. కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎల్.ఎల్.బి. డిగ్రీలు చేసారు. రూ. 125 జీతంతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. టైపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఇక్కడ కెరీర్ పెద్దగా లేకపోవడంతో రచనలు చేయడానికి.. నిర్ణయం తీసుకుని కలకత్తా గురించి అనేక విషయాలు రాసారు. తరువాతి ఐదు దశాబ్దాలు కలకత్తా నగరంపై పరిశోధనలు చేయడం, రాయడం అభిరుచిగా గడిపారు. నాయర్ దగ్గర అరుదైన పుస్తకాల సేకరణ ఉండేది.
అప్పట్లో, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్ఫర్డ్ లైబ్రరీ ఆ పుస్తకాలను కొనుగోలు చేసేందుకు లైబ్రరీ తరపున ఆయనకు బ్లాంక్ చెక్ పంపిందని చెప్తూ ఉంటారు. దానిని నాయర్, కలకత్తా టౌన్ హాల్ సొసైటీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. నాయర్ బాబుగా ప్రసిద్ధి చెందిన ఆయన, 1964 రెమింగ్టన్ టైప్ రైటర్‌ను ఉపయోగించారు. కేరళకు తిరిగి వచ్చే ముందు దక్షిణ కోల్‌కతాలోని భోవానిపూర్లోని కన్సారిపారా రోడ్‌లోని 82సిలో నివాసం ఉండేవారు. 1991లో, ఆయన తన పరిశోధన ద్వారా కలకత్తా నగరం 300వ వార్షికోత్సవాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనను బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్.) డిగ్రీతో సత్కరించింది. ఆయన జూన్ 18, 2024న కేరళలో 91 సంవత్సరాల వయసులో మరణించారు.






