అమెరికాలో భారతీయ విద్యార్థుల ఎంపిక అదే..
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న విదేశీ విద్యార్థులో అయిదోవంతుకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరుతున్నారు. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతుండగా, మిగిలిన కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అమెరికా విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 36.9 శాతం మంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) విడుదల చేసిన ఓపెన్ డోర్స్ 2022 నివేదిక ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది.
2021-22లో అమెరికాలో 9.48 లక్షల మంది 210 దేశాల విద్యార్థులు చదువుతున్నారు. వారిలో కంప్యూటర్ సైన్స్ (సీఎస్)లో చేరేవారే 2 లక్షల మంది (21.10 శాతం). వారిలో చైనా నుంచి 67 వేల మంది, భారత్ నుంచి 73 వేల మంది ఉండటం గమనార్హం. అమెరికాలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో వేతనాలు అధికంగా ఉండటంతో భారత్తో పాటు ఇతర ఆసియా దేశాల వారు కంప్యూటర్ సైన్స్పూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఐఎంఎప్ఎస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. ఆ కోర్సులో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన తెలిపారు.













