ఓపెన్ ఏఐ సీఈవోగా మళ్లీ శామ్ ఆల్ట్ మన్?
చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్ మన్ను మళ్లీ సీఈఓగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను తొలగించడం టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. సీఈవోగా ఆయన్నే కొనసాగించాలని ఇన్వెస్టర్లు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌తో కొంత మంది ఇన్వెస్టర్లు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఆల్ట్‌మన్‌తో కంపెనీ బోర్డు చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఆల్ట్‌మన్‌ను సీఈవోగా తిరిగి తీసుకురాకపోతే తాము కంపెనీ నుంచి వైదొలగుతామని కొందరు సిబ్బంది బోర్డుకు అల్టిమేటం ఇచ్చారట.
మరోవైపు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సైతం ఆల్ట్‌మన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తాత్కాలిక సీఈవో మిరా మురాటికీ ఆయన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోర్డు నిర్ణయం మేరకు ఆయన తన అభిప్రాయాన్ని అలా వ్యక్తపరిచినట్లు తెలిపారు.













