లక్ష మంది భారతీయులు… ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు
అమెరికా శాశ్వత నివాసం గ్రీన్‌కార్డు లక్షలాది మంది భారతీయులకు ఓ తీరని కల. దశాబ్ధాలుగా ఎంతో మంది ఆశావహులు నిరీక్షిస్తున్నారు. అయితే సాధారణ పరిస్థితులకు విరుద్ధంగా ఈ ఏడాది మరో రెండు నెలల్లోనే ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు పెద్ద సంఖ్యలో వృథా కాబోతున్నాయి. కరోనా అనంతరం గ్రీన్‌కార్డుల జారీలో విపరీతమైన జాప్యం కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది దాదాపు లక్షకుపైగా గ్రీన్‌కార్డులు మురిగిపోతాయనే అంచనాలున్నాయి. దీంతో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ వృతి నిపుణులు మరింత ఎక్కువ కాలం వేచిచూడాల్సి పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హక్కుకు జారీ చేసే డాక్యుమెంటే గ్రీన్‌కార్డ్. ఉపాధి అధారిత గ్రీన్ కార్డులను ఏడాదికి సాధారణంగా 1,40,000 జారీ చేస్తారు. కానీ ఈ ఏడాది అత్యధికంగా 2,61,500 జారీ చేయాలని నిర్ణయించారు. దురదృష్టవశాత్తూ సెప్టెంబర్ 30లోగా ఈ గ్రీన్‌కార్డుల పూర్తి కోటాను జారీ చేయకపోతే వీటిని శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని భారతీయ వృతి నిపుణుడు సందీప్ పవార్ తెలిపారు.
గ్రీన్‌కార్డుల జారీ పక్రియలో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లేదా యూఎస్సీఐఎస్ ప్రస్తుత వేగంగా చూస్తుంటే ఈ ఏడాది లక్షకు పైగా గ్రీన్‌కార్డులు వృథా అయ్యే అవకాశాలున్నాయి. ఇదే వాస్తవాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇటివలే నిర్ధారించారని సందీప్ పవార్ ప్రస్తావించారు. యూఎస్సీఐఎస్ లేదా బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది అదనంగా అందుబాటులోకి వచ్చిన లక్ష గ్రీన్‌కార్డులు వృథా అవుతాయని పవార్ పేర్కొన్నారు. అయితే అంశంపై ప్రశ్నించగా వైట్‌హౌస్ వర్గాలు స్పందించలేదని సమచారం.













