డోభాల్ పర్యటన ద్వారా అమెరికాతో దృఢ భాగస్వామ్యం : భారత్
క్వాంటమ్, సెమీకండక్టర్ ఇంజినీరింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్ అమెరికాల భాగస్వామ్యాన్ని దృఢపరిచే దిశగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పర్యటన సాగిందని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. గత మూడు రోజులగా అమెరికాలో పర్యటిస్తున్న భారత ఉన్నత స్థాయి బృందానికి డోభాల్ నేతృత్వం వహిస్తున్నారు. యూఎస్ భద్రతా సలహాదారు జేక్ సలివాన్‌తో పాటు ఇతర ప్రభుత్వ, విద్యా, వ్యాపార, పరిశోధనా రంగాల ప్రముఖులతో ఈ బృందం పలు చర్చల్లో పాల్గొని ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇస్రో, నాసా అధిపతుల ఆధ్వర్యంలో సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. అంతరిక్ష రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఉన్నత కక్ష్యలోకి చేర్చేలా సమావేశం జరిగిందని అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ ప్రకటించారు.













