ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్న ఉత్తర కొరియా
అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ ఉత్తర కొరియా మరోసారి అస్త్ర పరీక్షకు దిగింది. 2017 తర్వాత అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ఈ దఫా ప్రయోగించింది. దీంతో అమెరికా, పొరుగు దేశాల నుంచి ప్రయోజనాలు రాబట్టేందుకు అస్త్ర ప్రయోగాలకు దిగే పాత వ్యూహానికి మళ్లీ తెరతీసినట్లుయింది. అమెరికాతో సాగిస్తున్న దౌత్యంలో దీర్ఘకాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్యకు ఉత్తర కొరియా పూనుకుంది. పొరుగు దేశాల గగనతలం నుంచి ప్రయాణించే పరిస్థితిని నివారించడానికి తాజా క్షిపనిని బాగా ఎత్తులోకి వెళ్లేలా ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్, దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఆస్త్రం గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరి, ఆ తర్వాత సముద్రంలో పడిందన్నారు. ప్రయోగించిన ప్రదేశం నుంచి అది 800 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇది మధ్యంతర శ్రేణి క్షిపణి అని వివరించారు. 2017లో చివరిసారిగా ఇలాంటి శక్తిమంతమైన అస్త్రాన్ని ఉత్తర కొరియా పరీక్షించింది.













