ఉత్తర కొరియా ప్రభుత్వం.. విచిత్ర ఆంక్షలు
ఉత్తర కొరియా మాజీ దేశాధినేత కిమ్ జోంగ్ ఇల్ 10వ వర్థంతిని పురస్కరించుకొని ఉత్తర కొరియా ప్రభుత్వం పలు విచిత్ర ఆంక్షలు విధించింది. నేటి నుంచి 11 రోజుల పాటు నవ్వొద్దని, ఏడవొద్దని ప్రజలను ఆదేశించిది. మద్యం తాగడం, వేడుకలు చేసుకోవడంపై కూడా నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చింది. కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియాను పరిపాలించారు. నియంతృత్వ పోకడలతో ప్రజలకు ఆయన స్వేచ్ఛను దూరం చేశారు. ప్రస్తుత దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న ఈయన కుమారుడే. ఇల్ 2011 డిసెంబరు 17న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వర్థంతి నేపథ్యంలో దేశంలో ఈ దఫా 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. అవి కొనసాగినన్నాళ్లు ఎవరూ నవ్వకూడదని, పుట్టినరోజు వంటి వేడుకలు చేసుకోవదని ప్రభుత్వం ఆదేశిచింది. ఎవరైనా మరణించినా వారి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవకూడదని స్పష్టం చేసింది. గతంలో సంతాప దినాల సమయంలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా కొందరు మద్యం తాగుతూ పట్టుబడగా వారికి శిక్షలు విధించారు. వారిలో కొందరు తర్వాత జాడ లేకుండా పోయారని కూడా సమాచారం.













