అమెరికాలో అదృశ్యమైన ఎన్నారై బాలిక కేసు సుఖాంతం
అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక తన్వీ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఫ్లోరిడాలో తన్వీ సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్కాన్సాస్కు చెందిన తన్వీ (15) సుమారు రెండు నెలల క్రితం ఇంటిలో నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. టెక్ రంగంలో లే ఆఫ్స్ కారణంగా తన తల్లిదండ్రులు ఉద్యోగం కోల్పోతే భారత్కు వెళ్లవలసి వస్తుందన్న భయంతో ఆమె ఇల్లు వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. బాలిక చివరి సారిగా జనవరిలో కాన్వే జూనియర్ హైస్కూల్ సమీపంలో కనిపించింది. అక్కడి నుంచి కొన్ని మైళ్లు దూరం నడుచుకుంటూ వెళ్లిన ఆమె పాడుపడిన ఒక ఇంటిలో తల దాచుకుందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత అక్కడి నంచి ఫ్లోరిడా వెళ్లిందని పేర్కొన్నారు. తన్వీకి తరచుగా లైబ్రరీకి వెళ్లే అలవాటు ఉందని, అదే చివరకు ఆమె ఆచూకీ లభించడంలో కీలకమంగా మారిందని తెలిపారు. మార్చి 29న టంపాలకు చెందిన ఒక వ్యక్తి నుంచి పోలీసులకు కీలక సమాచారం అందింది. తన్వీని తాను లైబ్రరీలో చూసినట్లు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీనితో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తోంది.













