మళ్లీ బరిలోకి దిగిన మైక్ టైసన్ …
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (54) తన వయసు పెరిగినా చేవ తగ్గలేదని చాటాడు. పదిహేను సంవత్సరాల తరువాత బాక్సింగ్ బరిలో దిగిన ఈ మహాబలుడు రాయ్ జోన్స్ జునియర్ (51)తో జరిగిన ఎగ్జిబిషన్ బౌట్లో తనదైన శైలిలో పంచ్‌ల వర్షం కురిపించాడు. అయితే, మాజీ ప్రపంచ చాంపియన్ రాయ్ జోన్స్ జూనియర్ కూడా దీటుగా పోరాడడంతో ఈ బౌట్ డ్రాగా ముగిసింది. అయినప్పటికీ చాలా కాలం తరువాత టైసన్‌ను బాక్సింగ్ రింగ్‌లో చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మైక్ టైసన్ చివరిసారిగా 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో బౌట్లో పాల్గొన్నాడు. ఇందులో టైసన్‌కు పరాజయం ఎదురైంది. తాజా పోరులో టైసన్ ఎక్కువగా బాడీ షాట్స్ కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆ పవర్ పంచ్‌లను తట్టుకోవడం రాయ్ జోన్స్ జూనియర్‌కు శక్తికి మించిన పనైంది. టైసన్ సంబంధించిన బాడీ షాట్స్ కారణంగానే తాను త్వరగా అలసిపోయానని బౌట్ అనంతరం రాయ్ జోన్స్ వెల్లడించారు. కాగా, ఈ బౌట్లో తొలి రౌండ్లో రాయ్ జోన్స్ ఆధిపత్యం సాగించగా, రెండవ రౌండ్లో ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. మూడవ రౌండ్లో టైసన్ హవా సాగింది. ఈ ఎగ్జిబిషన్ బౌట్ అమెరికాలోని లాస్ ఏంజిల్‌లో జరిగింది.













