బిల్ గేట్స్‌తో విడిపోవడానికి అదే కారణం : మిలిందా గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో విడిపోయిన తరువాత ఎన్నోసార్లు కలత చెందానని, ఏడ్చానని, భయంకరమైన కలలతో సతమతమయ్యానని మాజీ భార్య మిలిందా గేట్స్ తెలిపారు. అమెరికాకు చెందిన వివాదాస్పద ఆర్థికవేత్త, పెట్టుబడిదారు జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్ భేటీ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయానని, ఆ పరిణామం తనకు నచ్చలేదని స్పష్టం చేశారు. బిల్‌తో విడిపోవడానికి అదో కారణమని అన్నారు. బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె తొలిసారిగా స్పందించారు. బిల్‌గేట్స్‌తో ఎప్స్టీన్ సమావేశమైనప్పుడు అదెవరా అని చూసి నిర్ఘాంతపోయానని, ఆ భేటీ అస్సలు నచ్చలేదని తెలిపారు. అది ఓ దుష్టశక్తితో భయంకరమైన భేటీ అని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడు వారిద్దరు సమావేశమయ్యారన్నది ఆమె చెప్పలేదు. పైగా ఆ సమావేశం వద్దని వారించారా అన్నదానిపైనా ఆమె స్పందించ లేదు.













