సైన్యానికి కిమ్ ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలి!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓ కీలక సైనిక జనరల్‌ను తొలగించిన ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు తెలిసింది. అలాగే, ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ సమావేశంలో పాల్గొన్న కిమ్ శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం సైనిక జనరల్‌గా ఉన్న పాక్ సు ఇల్ స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్ గిల్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపింది.













