అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఫెడెక్స్‌కు భారత సంతతి సీఈవో
అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన ప్రముఖ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్‌కు భారతీయ అమెరికన్ అయిన రాజ్ సుబ్రమణియంను సీఈవోగా నియమిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీఈఓ, చైర్మన్ ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1 నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. స్మిత్ స్థానంలో సుబ్రమణియం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2020లో సుబ్రమణియం తొలిసారి ఫెడెక్స్ బోర్డులోకి ప్రవేశించారు. ఇకపైన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ అధ్యక్షుడు, సీఈవోగా పనిచేశారు. అలాగే ఫెడెక్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా, చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇలా సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉండడం విశేషం.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియం ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు.













