అమెరికన్ దళాల ఉపసంహరణ

ఇరవై ఏళ్ల పాటు సాగించిన యుద్ధం అనంతరం అమెరికన్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వెనక్కి వెళ్లే పక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాలిబాన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే 1 నాటికి దళాలను మొత్తం ఉపసంహరించుకోవాల్సి ఉంది. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గడువును సెప్టెంబరు 11 వరకు పొడిగింది. మే నాటికి దళాలను వెనక్కి తీసుకోని పక్షంలో అమెరికా దళాలపై దాడులు చేస్తామని తాలిబాన్లు హెచ్చరించారు. దీంతో మే 1 నుంచి అంచెలంచెలుగా దళాలను ఉపసహరించుకుంటామని అమెరికా తెలిపింది. అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లే క్రమంలో వారికి రక్షణకుగాను అమెరికా ఇటీవల మరి కొన్ని అదనపు బలగాలను ఆఫ్ఘనిస్తాన్‍కు పంపింది. కాబూల్ సమీపంలోని బగ్రామ్ వైమానికి స్థావరం వద్ద అమెరికా హెలికాప్టర్ల కార్యకలాపాలు పెరిగాయి. నాటో బలగాల ఉపసంహరణ పక్రియ రెండు రోజుల క్రితమే మొదలైంది.