తెలుగు మహిళ ప్రపంచ రికార్డు…

యోగాలో క్లిష్టమైన కూర్మాసనం లో ఓ తెలుగు మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన కొణతాల జ్యోతి చైనాలో ఈ ఘనత సాధించారు. కూర్మాసనం యోగా భంగిమలో అత్యధిక సమయం 10 నిమిషాల పాటు ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డస్ లో చోటు సంపాదించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కొణతాల జ్యోతి, వృత్తిరీత్యా యోగా గురువు. హైదరాబాద్‍లో స్థిరపడ్డ జ్యోతి కుటుంబం, చైనా హునాన్ ప్రావిన్సులోని ఛాంగ్షా నగరంలో యోగా టీచర్‍గా అవకాశం రావడంతో 2012 నుంచి అక్కడే ఉంటూ చైనీయులకు యోగా బోధిస్తున్నారు. తనకు తెలిసిన విద్యలో ఏదైనా రికార్డు సాధించాలన్న తపనతో ఆమె యోగాసనాల్లో క్లిష్టమైన, కష్టమైన భంగిమల్లో ఎక్కువ సేపు ఉండడం సాధన చేశారు. అలా కూర్మాసనం యోగ భంగిమలో ప్రపంచంలో ఎవరూ ఉండనంత గరిష్ట సమయం ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డస్ సంస్థ ఈ మేరకు సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే అంతకంటే ముందే నోబుల్ బుక్ రికార్డ్సులోనూ చోటు సంపాదించినట్లు జ్యోతి తెలిపారు. 9 నెలల నిండు గర్భిణిగా ఉన్న సమయంలో డెలివరీకి 5 రోజుల ముందు పలు యోగాసనాలు ఆమె ప్రదర్శించారు. అష్టవక్రాసనం భంగిమలో 1 నిమిషం 41 సెకన్లు, మయూరాసనం భంగిమలో 1 నిమిషం 37 సెకన్ల పాటు ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. యోగాకు పుట్టినిల్లైన భారత్ నుంచే ఈ ఘనత సాధించడం తనకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే, ఆ కుటుంబ మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనే సూక్తిని తాను నమ్ముతానని, ఆ క్రమంలో తాను బోధించే యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ అందించడంతో పాటు, ప్రపంచ రికార్డులపై దృష్టి పెట్టానని ఆమె తెలిపారు.