అంజలి భరద్వాజ్ కి అమెరికా అవార్డు
వాషింగ్టన్ః ప్రముఖ భారతీయ సామాజిక ఉద్యమకర్త, అవినీతి నిర్మూలన పోరాటశీలి అయిన అంజలీ భరద్వాజ్‌కు అమెరికా జో బైడెన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాకరమైన ‘ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ చాంపియన్‌షిప్ అవార్డు’ను ప్రకటించింది. ‘సత్యానికి, పారదర్శకతకు, జవాబుదారీతనానికి కట్టుబడి ఉండి, అటు స్వదేశానికి, ఇటు ఇతర దేశాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా’ ఉన్నందుకు ఆమెకు ఈ అవార్డును అందజేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును ఇటీవలే నెలకొల్పారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ ఈ అవార్డును ప్రకటిస్తూ, అంజలీ భరద్వాజ్‌తో సహా 12 మంది పేర్లను ఈ అవార్డుకు పరిశీలించినట్టు తెలిపారు. వీరంతా తమ తమ దేశాలలో అవినీతి నిర్మూలనకు, పారదర్శకత్వానికి, జవాబుదారీతనానికి అవిశ్రాంతంగా పోరాటం జరిపారని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో ఉద్యమాలు నడిపారని ఆయన అభివర్ణించారు. ”ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో కలిసికట్టుగా పోరాడితే తప్ప అవినీతిని నిర్మూలించలేమని బైడెన్ ప్రభుత్వం నమ్ముతోంది. అవినీతిపై పోరాడడానికి, పారదర్శకత, జవాబుదారీతనాలకు అండగా నిలవడానికి ఎంతో గుండె ధైర్యం అవసరం. వీరందరిలోనూ ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అంజలీ భరద్వాజ్ ముందంజలో ఉన్నారు” అని బ్లింకెన్ పేర్కొన్నారు.
1973లో పుట్టిన అంజలి సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారతదేశంలో అవినీతి మీదా, జవాబుదారీతనం, పారదర్శకతల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ‘నేషనల్ కాంపైన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’కు సహ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న అంజలి, స్వయంగా ‘సతర్క్ నాగరిక్ సంఘటన్’ అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ఆమె సమాచార హక్కు, లోక్‌పాల్, ఆహార హక్కు వంటి ప్రజావసర అంశాలపై కూడా ఉద్యమ బాటను చేపట్టారు.
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.ఏ చేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో ఎం.ఎస్సి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.ఎస్సి చదివారు. 2003లో సతర్క్ నాగరిక్ సంఘటన్ స్థాపించిన తర్వాత ఆమె మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను సమాచార హక్కు కిందకు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకతలు ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఆమె సమాచార హక్కు చట్టాన్ని తీసుకు రావడానికి, నాయకులందరినీ ఆ చట్టం కిందకు తీసుకు రావడానికి ఆమె విశేష కృషి చేశారు. ఈ క్రమంలో ఆమె అనేక అవార్డులు అందుకున్నారు.













