ఆ దేశం అందించిన సాయాన్ని.. ఎప్పటికీ మరిచిపోలేం

కోవిడ్‍తో సతమతం అవుతున్న వేళ భారత్ అందించిన సాయాన్ని తాము ఎన్నటికీ మరిచిపోలేమని అమెరికా పేర్కొన్నది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. అమెరికా పర్యటలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‍ను కలిశారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు ఇండియా అండగా నిలిచిందని, ఆ దేశం అందించిన సహాయాన్ని తామెన్నటికీ మరిచిపోలేమని బ్లింకెన్ అన్నారు. ఇప్పుడు, ఈ దశలో ఇండియాకు అండగా తాము ఉన్నామని బ్లింకెన్ వెల్లడించారు.
జై శంకర్ అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య చర్చించేందుకు అనేక అంశాలు ఉన్నాయని అన్నారు. మన మధ్య ఉన్న బంధం మరింత బలపడినట్లు భావిస్తున్నానని, ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. విప్కతర సమయంలో అమెరికా ఇచ్చిన మద్దతు, సహకారం, సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జైశంకర్ అన్నారు. సమకాలీన పరిస్థితుల్లో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను అమెరికా, ఇండియా సంయుక్తంగా స్పందించినట్లు బ్లింకెన్ తెలిపారు. కోవిడ్ 19 ను నిర్మూలించేందుకు కలిసి కట్టుగా పనిచేస్తున్నామన్నారు.