ఆ దేశాల పథకం ప్రకారమే… ఈ అల్లర్లు
ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలపై ఆ దేశ అగ్ర నేత అయతుల్లా అలీ ఖమేనెయ్ తొలిసారిగా స్పందించారు. ఈ నిరసనలను అల్లర్లుగా పేర్కొన్న ఆయన వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని ఆరోపించారు. ఆ దేశాలు పథకం ప్రకారమే కుట్రపూరితంగా ఆందోళనలను ఎగదోస్తున్నాయంటూ మండిపడ్డారు. ఆ దేశానికి చెందిన మాసా అమీని అనే యువతి హిజాబ్ సరిగా ధరించనందుకు మూడు వారాల క్రితం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో మరణించడం అక్కడ ఆగ్రహజ్వాలలను రగిలించింది. అప్పటి నుంచి ఆ దేశం ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. తాజాగా టెహ్రాన్‌లోని షరీఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల వందల సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేశారు. అధికారులు వర్సిటీ గేట్లను మూసివేశారు.













