అమెరికా నిర్ణయం మంచిదే.. కానీ ఇది మాత్రమే చాలదు
తమ పౌర అణు కార్యక్రమంపై ఆంక్షలు ఎత్తివేస్తూ అమెరికా నిర్ణయించడం మంచిదే, కానీ ఇది మాత్రమే చాలదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇరాన్‌తో 2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఆంక్షలు సడలించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. విశ్వాసాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆంక్షలను తొలగిస్తున్నట్లు అమెరికా చెప్పిన మాటలు కాగితాలపైనే బాగానే ఉంటాయి. దేనికైనా ఆచరణే గీటురాయి అని ఇరానియన్ విదేశాంగ మంత్రి హుస్సేని అమీర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం జాతీయ భద్రత మండలి కార్యదర్శి అలీ శంఖానీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఘడియకో తీరుగా వ్యవహరిస్తుందని అన్నారు. అణు కార్యక్రమంపై ఏ ఒప్పందమైనా అది తమ దేశానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నదే ఇరాన్ విధించే ఏకైక షరతు అని అన్నారు.
2015 నాటి జాయింట్ కాంప్రె హెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసిపిఒఏ)లో తిరిగి చేరేందుకు వీలుగా ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలను ఎత్తివేస్తున్నామని, దీంతో ఒక సాంకేతికమైన అడ్డంకి తొలగిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.













