అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి
భారతీయులు ప్రపంచదేశాలలో స్థిరపడిన వారు చాలా మందే వున్నారు. వారు ఎక్కడ వున్నా మూలాలు మాత్రం ఇండియాలోనే ఉంటుంటాయి. అదే తరహాలో రాజాచారి పేరు మారుమోగుతోంది. మరి ఎవరీ రాజాచారి తెలుసుకుందా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రైవేట్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రూ-3 మిషన్ విజయవంతంగా ప్రారంభమైంది. తెలంగాణ సంతతి వ్యక్తి రాజాచారి ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నలుగురు వ్యోమగాములున్న క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. 22 గంటల అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన స్పేస్‌క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకొన్నది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
క్రూ-3 మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్‌మెరైన్ అధికారి కేలా బారన్, నాసాకు చెందిన టామ్ మార్ష్ బర్న్ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మత్తియాస్ మౌర్ర్ వెళ్లారు. వీరు 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. మెటీరియల్ సైన్స్, హెల్త్ టెక్నాలజీ, అంతరిక్షంలో మొక్కల పెంపకంపై అధ్యయనం చేయనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 23నే ఈ ప్రయోగం జరుగాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం గమనార్హం.
రాజాచారి అమెరికాలోనే జన్మించారు. ఆయన ప్రతిష్ఠాత్మక ఎంఐటీ నుంచి ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆపై అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేశారు. అమెరికా నేవీ టెస్ట్ స్కూల్ పైలెట్ కోర్సు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. నాలుగేళ్ల కిందట నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. తన రోదసీ యాత్ర కలను తాజాగా స్పేస్ ఎక్స్ ద్వారా నెరవేర్చుకున్నారు. చందమామపై అన్వేషణ కోసం నాసా చేపడుతున్న ప్రతిష్టాత్మక అర్టెమిస్ మిషన్ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశం ఉంది.













