భారత జాతీయుడికి రెండేళ్ల శిక్ష.. మైక్రోసాఫ్ట్ అకౌంట్లు డిలీట్ చేసిన నేరానికి కఠిన చర్య
వాషింగ్టన్ః కాలిఫోర్నియాలోని ఒక అమెరికన్ కోర్టు భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న దీపాంశు ఖేర్ అనే వ్యక్తిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. అతను ఆ సంస్థ నుంచి వెడుతూ వెడుతూ ఆ కంపెనీలోకి చెందిన సుమారు 1,200 యూజర్ అకౌంట్లను డిలీట్ చేశాడు. దానిపై విచారణ జరిపిన కోర్టు అతని నేరానికి రెండేళ్ల కఠిన శిక్షను విధించడమే కాకుండా, మరో మూడేళ్లు అతనిపై నిరంతర పర్యవేక్షణను కూడా విధించింది.
ఉద్యోగంలో ఉద్వాసనకు గురైన తర్వాత అతను కంపెనీ సర్వర్ గుట్టుమట్లు తెలుసుకుని, దాని నుంచి 1200 ఖాతాలను తొలగించాడు. ఆ తర్వాత ఆతను భారత్ వచ్చేశాడు. తనపై విచారణ జరుగుతోందని తెలియని దీపాంశు ఖేర్ గత జనవరి 11న మళ్లీ అమెరికాలో అడుగుపెట్టాడు. అతన్ని విమానాశ్రయంలోనే అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు తరలించారు.
”ఖేర్ చేసింది కుట్రపూరితమైన చర్య. అతను ఆ కంపెనీకి ఎంతో నష్టం కలిగించాడు” అని ఆపద్ధర్మ అమెరికా అటార్నీ రాండీ గ్రాస్మన్ వ్యాఖ్యానించారు. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి మేరిలిన్ హఫ్ ఈ శిక్ష విధిస్తూ, ”ఖేర్ ఎంతో తెలివిగా, ఒక పథకం ప్రకారం ఈ సైబర్ నేరానికి పాల్పడ్డాడు. కంపెనీ మీద ప్రతీకారంతోనే అతను ఈ పనిచేశాడనడంలో సందేహం లేదు” అని పేర్కొన్నారు.
రెండేళ్ల కారాగారవాసం విధించిన న్యాయమూర్తి హఫ్ అతనికి మూడేళ్ల పర్వవేక్షణను, 5,67,084 అమెరికన్ డాలర్ల జరిమానాను కూడా విధించారు. తమ 1200 అకౌంట్లను పునరుద్ధరించుకోవడానికి కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అయిందని న్యాయమూర్తి తెలిపారు.
కోర్టు ఇచ్చిన వివరాల ప్రకారం, ఒక ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ 2017 నుంచి 2018 మే వరకు అతన్ని ఉద్యోగంలోకి తీసుకుంది. కారిస్బాడ్ కంపెనీ అనే సంస్థ తాను మైక్రోసాఫ్ట్‌లో విలీనం కావడానికి సహాయపడాల్సిందిగా ఈ కన్సల్టెన్సీ సంస్థను కోరింది. అందులో భాగంగా ఆ కన్సల్టెన్సీ సంస్థ దీపాంశు ఖేర్‌ను కారిస్బాడ్ కంపెనీలోకి పంపించింది.
దీపాంశు ఖేర్ పనితీరుతో సంతృప్తి చెందని కారిస్బాడ్ కంపెనీ తన అసంతృప్తిని కన్సల్టెన్సీ సంస్థకు తెలియజేసింది. దాంతో ఆ కంపెనీ నుంచి అతన్ని కన్సల్టెన్సీ సంస్థ 2018 జనవరిలో వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరం మే 4న ఆ కన్సల్టెన్సీ సంస్థ కూడా ఖేర్‌కు ఉద్వాసన చెప్పింది. ఒక నెల రోజుల పాటు అమెరికాలోనే ఉన్న ఖేర్ జూన్‌లో ఢిల్లీ వెళ్లిపోయాడు.
ఢిల్లీ వచ్చిన రెండు మూడు నెలలకు, అంటే ఆగస్టులో అతను కారిస్బాడ్ కంపెనీ సర్వర్‌ను కనుక్కుని, హ్యాక్ చేసి, అందులోంచి 1500 యూజర్ అకౌంట్లలో 1200 అకౌంట్లను డిలీట్ చేశాడు. అతని చర్య కంపెనీ పైనా, కంపెనీ సిబ్బంది పైనా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించింది. కంపెనీని రెండు రోజుల ఆటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. ఈ అకౌంట్ల తాలూకు ఈమెయిల్స్, కాంటాక్టులు, కీలక జాబితాలు, సమావేశాల తేదీలు, డాక్యుమెంట్లు, డైరీలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల వివరాలు వగైరాలన్నీ గల్లంతు కావడంతో కంపెనీ బాగా నష్టపోయింది.













