ఈ కుంభకోణంలో తెలుగువారు కూడా ఉన్నారా ?

నకిలీ పత్రాలతో అమెరికా హెచ్-1 బీ వీసాలు మంజూరు చేయిస్తూ అడ్డంగా దొరికిన క్లౌడ్‍జెన్ సంస్థ బాగోతం వీసాల ఆడిటింగ్‍లో బట్టబయలైంది. లేబర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో జరిగిన హెచ్-1బీ వీసాల ఆడిట్‍లో కొంతకాలంగా క్లౌడ్‍జెన్ సంస్థకు చెందిన క్లయింట్లలో అధిక శాతం అమెరికాకు వచ్చిన కొన్ని నెలల్లోనే కంపెనీలు మారడం, ఆ వెంనే హెచ్-1బీ వీసాలను ట్రాన్స్ఫర్ చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరా తీయగా ఈ కంపెనీకి వచ్చిన చాలా మంది క్లయింట్లు నకిలీ లెటర్లపై హెచ్-1బీ వీసాలు సంపాదించారని, అమెరికా చేరుకున్నాక మరో కంపెనీలో చేరి వీసాలను ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.
గతేడాది వెలుగుచూసిన ఈ కుంభకోణంలో తెలుగువారు కూడా ఉన్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలో ఉన్న క్లౌడ్‍జెన్ సంస్థ శాఖ ప్రస్తుతానికి మూతబడి ఉన్నా.. ఈ కార్యాలయం ద్వారా కూడా పలువురు వెళ్లి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కంపెనీ స్కాం గురించి ఇంత వరకూ తమకు ఎలాంటి సమాచారం లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.