కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ ఘాతుకం
తన కుమారుడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్న ఆగ్రహంతో కోడల్ని మామ కాల్చిచంపిన దారుణ ఉదంతమిది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దక్షిణ శాన్ జోస్‌లో గతవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుణ్ని కాలిఫోర్నియా లోని ఫ్రెస్నో నగరవాసి, భారతీయ అమెరికన్ సీతల్ సింగ్ దోసంర్ (72)గా గుర్తించిన పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. మృతురాలిని సీతల్ సింగ్ కోడలు గుర్ప్రీత్ కౌర్‌గా నిర్ధారించారు. తన కుమారుడితో వివాహ బంధాన్ని తెంచుకునేందుకు గుర్ప్రీత్ సిద్ధమవుతుండటం సీతల్ సింగ్‌కు ఆగ్రహం కలిగించింది. దీంతో కోడలు పనిచేస్తున్న సంస్థ వద్దకు వెళ్లిన అతడు పార్కింగ్ ప్రదేశంలో ఆమెను కాల్చిచంపాడు.













