భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలకు.. యూఎస్ ప్రెసిడెన్షియల్ పురస్కారం
భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలను అమెరికాలోనే అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (పీఎల్ఏ) వరించింది. హ్యూస్టన్‌కు చెందిన ఆయన ప్రవాస భారతీయ సమాజానికి, అమెరికాకు పెద్దఎత్తున చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో అత్యుత్తమ అంకితభావం ప్రదర్శించిన వారిని ఏటా పీఎల్ఏ పురస్కారం వరిస్తుంది. ఈ సంస్థ కింద 50 లక్షల మంది అమెరికా పౌరులు వివిధ కార్యక్రమాల క్రింత అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు గత వారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికా కోర్ సర్టిఫయర్ డాక్టర్ సోనియా ఆర్ వైట్ వావిలాలకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇందులో శ్వేతసౌధం నుంచి అధ్యక్షుడు బైడెన్ సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, మెడల్ ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వావిలాల సతీమణి ప్రభాత్ లక్ష్మీ, కుమార్తెలు మోనికా, అమండ, నలుగురు మనవలు హాజరయ్యారు. అనూహ్యంగా లభించిన ఈ గౌరవం నన్ను కదిలించింది. హ్యూస్టన్‌లోని భారతీయులకు అందించిన సేవలకు ఇది నిజమైన గుర్తింపు అని పురస్కార ప్రదానోత్సవంలో కృష్ణ పేర్కొన్నారు. 2006లో హ్యూస్టన్ వర్సిటీలో ఇండియా స్టడీస్ పోగ్రామ్‌ను వావిలాల స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో టెక్సాస్‌లోని సదరన్ యూనివర్సిటీ లోనూ ఇండియా స్టడీస్ ప్రోగ్రామ్ ప్రారంభించడంలో ఆయనదే ముఖ్యపాత్ర.













