గ్రీన్‌కార్డుల కోసం యూఎస్ క్యాపిటల్ వద్ద భారత సంతతి వైద్యుల నిరసన!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల కోసం భారత సంతతికి చెందిన పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద నిరసనకు దిగారు. గ్రీన్‌కార్డులు మంజూరు చేయడంలో అనుసరిస్తున్న దేశాల వారీ పరిమితిని (కంట్రీ క్యాప్) తొలగించాలని భారతీయులు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల తాము వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా, వేరే ఉద్యోగానికి మారాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం గల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కేవలం 7 శాతం మంది భారతీయులు మాత్రమే గ్రీన్‌కార్డులు పొందుతున్నారని, కనుక ఈ కంట్రీ క్యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
“కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సైతం సేవలు అందిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరికీ ఒక్కో కథ ఉంది. మాకు న్యాయం కావాలి. అది చేయమనే అడుగుతున్నాం.” అని ఆందోళనలో పాల్గొన్న వైద్యులు రాజ్ కర్నాటక్, ప్రణవ్ సింగ్ తెలిపారు. తాము అమెరికాలోనే శిక్షణ పొందామని, ఆ తర్వాత ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నామని వెల్లడించారు. గ్రీన్‌కార్డులు లేకపోవడం వల్ల వేరే ప్రాంతాలకు గానీ, వేరే ఉద్యోగానికి గానీ మారడం ఇబ్బందికరంగా మారుతోందని వాపోయారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల దశాబ్దాలు గడిచినా గ్రీన్‌కార్డులు పొందడం అసాధ్యమని, దేశాల వారీ కోటాను వెంటనే ఎత్తివేసి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా భారతీయ వైద్యులు డిమాండ్ చేశారు.













