భారత్-సౌదీ అరేబియా ఒప్పందం
హజ్ కోటాపై భారత్-సౌదీ అరేబియా తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికిగాను భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరపున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ సౌదీ తరపున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిగ్ అల్ రబియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కోటా ప్రకారం 1,40,020 సీట్లు హజ్ కమిటీ ద్వారా వెళ్లే వారికి కేటాయిస్తారు. 35,005 సీట్లు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి ఇవ్వనున్నారు.యాత్రికులకు కీలక సమాచారం అందించడంలో భారత్ చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలను సౌదీ బృందం అభినందించింది. వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం, యాత్రికుల శ్రేయస్సుకు పెద్దపీట వేయడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ చర్చల సందర్భంగా వారు చూపిన స్ఫూర్తి, సహకారం ఎప్పటికీ గుర్తిండిపోతుందన్నారు.













