బ్రిటన్ నుంచి భారత్ కు విమానాల రద్దు
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 31 వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. రేపు అర్థరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. అంతేగాక, యూకే నుంచి డిసెంబరు 22 అర్థరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది.
బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. అయితే కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.













