భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి : జైశంకర్
భారత్, చైనా మధ్య సంబంధాల విషయంలో మరోమారు కేంద్ర విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పునరుద్ఘాటించారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ ఘటన, బలగాల మోహరింపుతో సంబంధాల్లో తేడాలు వచ్చాయని నిర్మొహమాటంగానే వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించే బదులు, 2020 సంవత్సరంలో జరిగిన సంఘటనలు మరింత ఒత్తిడికి గురి చేశాయని పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నా, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే కొన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొనే కొత్త విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2020 కి ముందు 1971 లో ప్రాణనష్టం సంభవించిందని, అందుకే తూర్పు లడఖ్‌లో జరిగిన ఘటనలు ఇరు దేశాలను ఇబ్బంది పెట్టాయని అన్నారు. ప్రస్తుతం మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయం మాత్రం చెప్పలేమని, వాస్తవాధీన రేఖపై ఉమ్మడి అవగాహనకు రావడంలో ఎలాంటి ప్రగతీ లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇచ్చి పుచ్చుకోడాలు ఉంటేనే సంబంధాల్లో పురోగతి ఉంటుందని జైశంకర్ సూచించారు.













