ఐరాసలో మిషన్ లైఫ్ ప్రత్యేక ప్రదర్శన : రుచిరా కాంబోజ్
సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్లు గతేడాది ప్రారంభించిన మిషన్ లైఫ్ (పర్యావరణ కోసం జీవనశైలి)పై అమెరికా లోని ఐరాస ప్రధాన కార్యలయంలో భారత్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. రెండురోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రారంభించారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ మిషన్ లైఫ్ ప్రయాణానికి సంబంధించి మేం ఉమ్మడిగా ఓ స్ఫూర్తిమంతమైన ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. మిషన్ లైఫ్ అనేది కేవలం ప్రభుత్వం కార్యక్రమం కాదు. ఇది ప్రతి ఒక్కరితో మొదలయ్యే సమిష్టి నిబద్ధత. మన రోజువారి జీవితాల్లో చోటుచేసుకునే చిన్నచిన్న మార్పులతో పర్యావరణంపై చూపే అద్భుత మార్పును తేవడమే మిషన్ లైఫ్. పర్యావరణ అనుకూల విధానాలతో మనం రోజువారీ వ్యవహారాలను మార్చుకోవడమే కాదు, మన భూగ్రహానికి సంబంధించి కొత్త విధిని రూపొందించడం అని ఆమె వివరించారు.













