ఐరాసలో ఓటింగ్ కు భారత్ గైర్హాజరు
ఉక్రెయిన్ యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు రష్యా బాధ్యత వహించాలని, కీవ్‌కు జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలని ఐరాస జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ తీర్మానాన్ని ఉక్రెయిన్ ప్రవేశపెట్టగా, 94 దేశాలు అనుకూలంగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. తీర్మానం ఓటింగ్‌కు 73 దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్, భూటన్, బంగ్లాదేశ్, బ్రైజిల్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇజ్రాయెల్, నేపాల్, పాకిస్థాన్, ద.ఆఫ్రికా, శ్రీలంక తదితర దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన దేశాల్లో బెలారస్, చైనా, క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, సిరియా ఉన్నాయి.
మొత్తం మీద ఈ తీర్మానం ఆమోదం పొందింది. దీనిగురించి భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం వల్ల పరిహారం లభిస్తుందా అన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఐరాస తీర్మానం చట్టబద్ధత అస్పష్టం. అంతర్జాతీయ సమాజంపై భవిష్యత్తు ప్రభావం అంచనా వేయకుండా కొత్త యంత్రాంగాలను సృష్టించకూడదు. ఇలాంటి ప్రయత్నాలు చర్చలకు, దౌత్యానికి ముందస్తుగానే ముగింపు పలికే ప్రమాదం ఉందని అని పేర్కొన్నారు.













