అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ మద్దతు
అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా భద్రతా బలగాల ఉపసంహరణపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా నిలిచారు. బైడెన్ చేసిన పని సరైనదేనని అన్నారు. అఫ్ఘాన్‌కు అంతర్జాతీయ సహాయం నిలిచిపోయి, అక్కడ సంక్షోభం తలెత్తకుండా అమెరికా వ్యూహాలు రూపొందించాలని కోరారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించడంపై అమెరికా అధ్యక్షుడిని ఇమ్రాన్ ప్రశంసించారు. అధ్యక్షుడు బైడెన్ చాలా అన్యాయమైన విమర్శలు వస్తున్నాయి. కానీ ఆయన ఉత్తమమైన పని చేశారు అని పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో అమెరికా దళాలు పనిచేయడానికి ఏకైక కారణం ఉగ్రవాదం అణచివేత కోసం. ఆ నేల మళ్లీ ఉగ్రవాదులకు అడ్డాగా మారి సంక్షోభం వైపు మళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న అఫ్గాన్‌లో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో తనకు తెలియదని పేర్కొన్నారు.













