హరికేన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం …
ఇయన్ హరికేన్ ధాటికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం భారీగా నష్టపోయింది. దాదాపు 47 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. దక్షిణ కరోలినాలో మరో పది మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. అలలు ముంచెత్తడంతో ఇప్పటికీ ఫ్లోరిడా, దక్షిణ కరోలినా తదితర ప్రాంతాల్లో వరద తగ్గు ముఖం పట్టలేదు. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా బంద్ అయింది. సుమారు 2.80 లక్షల మంది విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నారు. సుమారు 30 అడుగులు మేర అలలు ఎగిసిపడడంతో ఫ్లోరిడాలో భారీ సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ ఇళ్లల్లో ఎవరైనా చిక్కుకుపోయారేమోనని వలంటీర్లు, అధికారులు పడవల్లో వెళ్లి మరీ గాలిస్తున్నారు. ఇలా సుమారు 1000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద హరికేన్లలో ఇయాన్ ఒకటిగా చెబుతున్నారు. మరికొద్ది రోజులు వరద ప్రభావం ఉండొచ్చని హరికేన్ సెంటర్ అధికారులు అంచనా వేస్తున్నారు.













