ప్రయాణికులకు అమెరికా భారీ షాక్…
ఇండియా, అమెరికా మధ్య విమానాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలు మరింత కఠినంగా మారకముందే అమెరికా వెళ్లాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య భారీగా ఉంది. దీంతో విమానాలకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. సాధారణంగా ఇండియా నుంచి అమెరికాకు టికెట్ ధర రూ.50 వేలు ఉంటుంది. అయితే గత వారంలో మాత్రం ఈ ధరలు సగటున రూ.1.5 లక్షలకు చేరినట్లు విమానయాన శాఖ వర్గాలు వెల్లడించారు.
ఇండియాలో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా గత గురువారం అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. అప్పటి నుంచీ సాధ్యమైనంత త్వరగా అమెరికా వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. గత గురువారం అమెరికా లెవల్ 4 ప్రయాణ ఆంక్షలు విధించింది. అమెరికా నుంచి ప్రయాణికులు ఇండియాకు వెళ్లకూడదు. ఈ ఆంక్షలు మరింత కఠినమైతే ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై కూడా నిషేధం విధించే ప్రమాదం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.













