2022 సంవత్సరానికి హెచ్ 1బీ కోటా ఫుల్…
అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన పరిమితి మేరకు 2022 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్ 1 బీ వీసాలకు తగినన్ని దరఖాస్తులు అందాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. హెచ్ 1 బీ వీసాల ద్వారా వేలాది మంది ఉద్యోగులను భారత్, చైనా నుంచి ఏటా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. విదేశీ ప్రొఫెషనల్స్‌లో అత్యధికంగా డిమాండ్ ఉన్న వర్క్ వీసాలలో హెచ్1 బీ వీసా ప్రధానమైనది. అమెరికన్ కాంగ్రెస్ నిర్దేశించిన మేరకు ఏటా గఠిష్టంగా 65,000 హెచ్1 బీ వీసాలను అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతో పాటు మరో 20,000 హెచ్1 బీ వీసా యూఎస్ అడ్వాన్డ్స్ డిగ్రీ ఎక్సెంప్షన్ (మాస్టర్స్)ను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వీసాల కోసం వచ్చే దరఖాస్తులను ప్రతి ఏడాది పరిశీలించే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సిఐఎస్) నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి అవసరమైనన్ని దరఖాస్తులు తమకు అందినట్లు ప్రకటించింది. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు నోటిఫికేషన్లను వారు ఆన్లైన్ అకౌంట్లకు పంపించే ప్రక్రియ చేపట్టినట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది.













