కొలరాడో లో కాల్పుల మోత… పది మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడి వినియోగదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు, ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌల్డర్‌లోని కింగ్ సూపర్ మార్కెట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం 10 మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు అని తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్ జేర్డ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యా. కింగ్ సూపర్స్ వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నేను నిశితంగా గమనిస్తున్నా అని జేర్డ్ ట్వీట్ చేశారు.













