జీమెయిల్ సర్వీసులు బంద్.. క్లారిటీ ఇచ్చిన గూగుల్
గూగుల్‌కు చెందిన ఇ మెయిల్ సర్వీస్ జీమెయిల్ సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిపిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్ స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది. ఏళ్లుగా లక్షలాది మందికి ఇ మెయిల్ సేవలు అందిస్తున్న జీమెయిల్ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్కీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్ పంపించడం గానీ, పొందడం గానీ చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్‌కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. అది కాస్తా ఎక్స్, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది జీమెయిల్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారంపై గూగుల్ స్పందించింది. జీమెయిల్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్ట్ పెట్టింది. తద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న అబద్దపు ప్రచారానికి చెక్ పెట్టింది. ఈ ప్రచారంపై టెక్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రకటనలను ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.













