వచ్చే వారం నుంచి అందుబాటులోకి : గూగుల్
భూకంపాల రాకను ముందే హెచ్చరించే ఆండ్రాయిడ్ భూకంప అప్రమత్త సేవలను భారతదేశంలో వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ సర్వీసును గూగుల్ ఇప్పటికే పలు దేశాల్లో అందించింది. ఇంటర్నెట్ ద్వారా సందేశాలు కాంతివేగంతో ప్రసారమవుతాయి. భూప్రకంపనల వేగం అంతకన్నా చాలా తక్కువ. అవి ప్రారంభమవగానే వినియోగదారులను హెచ్చరించే సెన్సర్లను ఆండ్రాయిడ్ ఫోన్లలో అమర్చనున్నారు. ఈ ఫోన్ల లోని సూక్ష్మ యాక్సెలోమీటర్లు భూకంపాలను పసిగట్టే మినీ సైస్మోమీటర్లుగా పనిచేస్తాయి. ఫోన్ను ఛార్జింగ్ చేసేటప్పుడు భూమి కాస్త కంపించినా యాక్సెలోమీటర్ పసిగడుతుంది. భూకంపం రానున్న ప్రాంతంలో పలు స్మార్ట్ఫోన్ల యాక్సెలో మీటర్లు చుట్టుపక్కల భూమి కంపిస్తున్నట్లు కనిపెట్టిన వెంటనే, ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్ అందిపుచ్చుకుని భూప్రకంపనల కేంద్ర, భూకంప తీవ్రతను వినియోగదారులకు చేరవేస్తుంది.













