వ్యాక్సిన్ సరఫరాకు పటిష్ఠ చర్యలు
అమెరికా వ్యాక్సిన్ దౌత్యానికి సమన్వయకర్త నియామకం
వాషింగ్టన్ః అమెరికా కరోనా వ్యాక్సిన్ దౌత్యానికి బైడెన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సమన్వయకర్తను నియమించింది. అమెరికా నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరాలను కోరుతున్న దేశాల విషయంలో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ సమన్వయకర్త ప్రయత్నిస్తారు.
యు.ఎస్. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యు.ఎస్.ఎ.ఐ.డి) మాజీ సమన్వయకర్త గెయిల్ స్మిత్‌ను వ్యాక్సిన్ దౌత్యానికి సమన్యయకర్తగా నియమిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్ ప్రకటించారు. ఆమె ఒబామా ప్రభుత్వంలో యు.ఎస్.ఎ.ఐ.డి సమన్యయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె విదేశాంగ శాఖలోని గ్లోబల్ కోవిడ్ రెస్పాన్స్ అండ్ హెల్త్ సెక్యూరిటీకి సమన్వయకర్తగా నియమితులయ్యారు.
దేశంలో ఉత్పత్తయ్యే కరోనా వ్యాక్సిన్‌ను వివిధ దేశాలకు ఎలా సరఫరా చేయాలన్న అంశంపై గెయిల్ స్మిత్ చర్యలు తీసుకుంటారని బ్లింకన్ తెలిపారు. గత ఆదివారం ఉదయం నాటికి అమెరికాలో 16.50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ‘‘మరింతగా వ్యాక్సిన్ సరఫరా చేయాలని చాలా దేశాలు అమెరికాను కోరుతున్నాయి. కొన్ని దేశాలలో కరోనా విపరీతంగా విజృంభిస్తుండడంతో అవి అమెరికా మీద తక్షణ సరఫరాకు బాగా ఒత్తిడి తెస్తున్నాయి. అటువంటి దేశాల కోసం మేం అతి వేగంగా చర్యలు తీసుకుంటున్నాం” అని బ్లింకన్ వివరించారు.
చైనా, రష్యాలతో పోటీ
చైనా తన వ్యాక్సిన్ దౌత్యంలో భాగంగా అనేక దేశాలకు వేగంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తుండడంతో అమెరికా దానికి పోటీగా తన చర్యలను వేగవంతం చేయదలచుకుంది. నిజానికి రష్యా కూడా ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తుండడమే కాకుండా, ఆఫ్రికన్ యూనియన్ కొనుగోలు పథకం కింద ఆ దేశాలకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తోంది. ‘‘మా సన్నిహిత పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో దేశాలకు మేం పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందజేస్తున్నాం. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, సరఫరాదార్లతో ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యం ఏర్పరచుకుని మేం మా సరఫరాలు పెంచడానికి, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం” అని బ్లింకన్ తెలిపారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగం విషయంలో అమెరికా ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలియజేయలేదు కానీ, మెక్సికో, కెనడాలకు ద్వైపాక్షిక రుణ ఒప్పందంలో భాగంగా 40 లక్షల డోసుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. కాగా, 2022 చివరి నాటికి ఆసియా దేశాలన్నిటికీ కలిపి బిలియన్ డోసులను పంపిణీ చేయాలని అమెరికా భావిస్తోంది. ఇందుకు గాను మూడు మిత్ర దేశాలతో అది ఒప్పందం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్త వైరస్ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆరితేరిన వ్యక్తిగా గెయిల్ స్మిత్‌కు పేరుంది. గతంలో ఆమె క్షయ, ఎయిడ్స్, మలేరియాలను ఎదుర్కోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, 2030 నాటికి పేదరికాన్ని, ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కృషిచేస్తున్న ‘వన్ కాంపైన్) అనే సంస్థకు ఆమె సి.ఇ.ఓగా పనిచేశారు.
‘‘సమష్టి కృషి, సైన్స్, నిఘా, అప్రమత్తత, సరైన నాయకత్వాలతో ప్రపంచం నుంచి ఏ వైరస్‌నైనా తరిమేయవచ్చు” అని గెయిల్ స్మిత్ వ్యాఖ్యానించారు. అమెరికాది పటిష్ఠమైన, సమర్థవంతమైన నాయకత్వం. కరోనా వైరస్‌ను అతి త్వరలో నిర్మూలిస్తామనడంలో సందేహం లేదు” అని కూడా ఆమె స్పష్టం చేశారు.













