రష్యాపై ఆంక్షలు కొనసాగిస్తాం : జీ 7 దేశాలు
ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, ఆ దేశానికి ఆర్థికంగా, సైనికంగా సంపూర్ణ సహకారాలను అందజేస్తామని జి-7 దేశాలు స్పష్టం చేశాయి. జర్మనీలోని మన్స్టర్లో రెండు రోజులుగా జరుగుతున్న జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌కు చెందిన విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో రానున్న రోజుల్లో రష్యా ఇంధన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. మాస్కోకు సహకరించిన దేశాలు, వ్యక్తులు, సంస్థలను వదిలిపెట్టబోమని ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామని ప్రతిన బూనింది. విద్యుత్తు, తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేస్తున్న దాడులను ఖండిరచింది.













