చైనా, ఉత్తర కొరియాల దూకుడుకు కళ్లెం
రష్యాను అడ్డుకునేలా ఉక్రెయిన్‌కు మరింత మద్దతు కూడగట్టేందుకు కృషి చేద్దామని, తైవాన్‌పై కాలుదువ్వుతున్న చైనాకు చెక్ పెడదావని, క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియాకు గుణపాఠం చెబుదామని జీ-7 దేశాల మంత్రుల సమావేశం నిర్ణయించింది. వచ్చే నెలలో హిరోషిమాలో జరగనున్న జీ-7 దేశాల అధినేతల సమావేశానికి సన్నాహకంగా కరిజావా రిసార్టులో మంత్రులు సమావేశమయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనే ఎక్కువగా వారు చర్చించారు. రష్యా అణు ఆయుధాలను వాడతామని హెచ్చరించడాన్ని జపాన్ విదేశాంగ మంత్రి యోషిమసా హయాషి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌కు ఇంధన, సైనిక సాయంలో మద్దతు సాధించడమే అమెరికా అధ్యక్షుడు బైడెన్ లక్ష్యమని, ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రతినిధి వెల్లడించారు. సమావేశానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు.













