ఆ దేశంపై ఇక మరిన్ని ఆంక్షలు
ఉక్రెయిన్‌లో మారణకాండ సాగిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు శిక్ష తప్పదని జీ-7 దేశాల అధినేతలు హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూటమి దేశాల అధినేతలు జపాన్‌లోని హిరోషిమాకు చేరుకున్నారు. అనంతరం సమావేశమై తాజా అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌కు రష్యా చట్ట విరుద్ధమైన, న్యాయ విరుద్ధమైన యుద్ధం సాగిస్తోందని మండిపడ్డారు. రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని జి-7 దేశాల నేతలు ప్రతిన బూనారు. రష్యా ప్రారంభించిన ఈ యుద్దాన్ని రష్యానే ముగించాలని అన్నారు. హిరోషిమాలోని శాంతి పార్కును వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో దెబ్బతిన్న డోమ్ వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి, అమర వీరులకు నివాళులర్పించారు. జి-7 శిఖరాగ్ర సదస్సుకు గుర్తుగా చెర్రీ మొక్కును నాటారు.













