విడాకులు తీసుకున్న విదేశీయులకు ఆ హోదా రద్దు … కేంద్రం
విదేశీయులకు భారత పౌరసత్వం పొందే వీలున్న ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఓసీఐ పొందిన విదేశీయులు.. విడాకులు తీసుకున్న తరుణంలో ఆ హోదా రద్దు అవుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు కేంద్ర హోం శాఖ వివరణ ఇచ్చింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్నందుకే విదేశీయులకు ఓసీఐ హోదా లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే బెల్జియంకు చెందిన ఓ మహిళ 2006లో ఒక భారతీయుడ్ని వివాహం చేసుకుంది. 2011లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత తనకు మంజురైన కార్డును మహిళ తిరిగి ఇవ్వాల్సిందేనని హోం శాఖ తెలిపింది. ఇలాంటి విదేశీయులు భారత్లో చట్ట ప్రకారం నివసించాలనుకుంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని హోం శాఖ స్పష్టం చేసింది.













