విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం..
భారతదేశ విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్క•తమయ్యింది. ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనత సాధించారు. అత్యంత సుదూర ప్రయాణం చేసి ప్రపంచానికి చెరో కొసన ఉన్న అమెరికా శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు విజయవంతంగా తిరిగివచ్చారు. ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు 16 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో (స్థానిక కాలమానం ప్రకారం) శనివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. తమ ప్రయాణంలో ఎక్కడా ఆగకుండా వారు విమానాన్ని నడపడం విశేషం. ఈ విమానాన్ని నడిపినవారిలో కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరె, కెప్టెన్ శివానీ మన్హాస్ ఉన్నారు. కెప్టెన్ తన్మయి మన తెలుగమ్మాయి కావడం విశేషం.
కాగా, తాము ఈ రోజు చరిత్ర సృష్టించామని కెప్టెన్ జోయా అగర్వాల్ అన్నారు. కేవలం ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని తీసుకురావడమే కాకుండా, విమానాన్ని అంతా మహిళా పైలట్లమే నడపడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పామని చెప్పారు. ఈ ఘనతలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర ధ్రువం మార్గంలో రావడం వల్ల 10 టన్నుల ఇంధనాన్ని ఆదాచేశామని వెల్లడించారు. ఇది గొప్ప అనుభవం అని, చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని కెప్టెన్ శివానీ మన్హాస్ అన్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి తాము ఇక్కడికి చేరుకోవడానికి 17 గంటలు పట్టిందని చెప్పారు.













