అమెరికాలో సీపీఐ నారాయణకు చేదు అనుభవం
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అగ్రనేత నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి క్యూబాలోని హవానా విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్లిన నారాయణ అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో ఫోటో దిగారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది ఫోన్లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటల పాటు అక్కడే ఆపారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేసినట్లు నారాయణ తెలిపారు.













