70 ఏళ్ల తర్వాత ఓ మహిళకు మరణ శిక్ష!
అమెరికాలో 70 ఏళ్ల తర్వాత ఓ మహిళకు మరణ శిక్ష అమలు కానుంది. ఎందుకంటే ఆమె ఓ నిండు గర్భిణిని హత్య చేసినందుకు ఫెడరల్ కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. 2021, జనవరి 12వ తేదీన ఆ మహిళకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఈ శిక్షను అమలు చేయనున్నారు. 2004, డిసెంబర్ 16వ తేదీన లిసా మోంట్గోమేరి(49) మిస్సోరిలోని బాబీ జో స్టిన్నెట్(23) నివాసానికి వెళ్లింది. కుక్క ప్లిలను కొనుగోలు చేసేందుకు వస్తున్నానని చెప్పిన లిసా.. స్టిన్నెట్ నివాసానికి వెళ్లిన తర్వాత దారుణానికి పాల్పడింది. 8 నెలల గర్భవతి అయిన స్టిన్నెట్ను తాడును గొంతుకు బిగించి చంపేసింది లిసా. ఆ తర్వాత కిచెన్ కత్తితో గర్భిని కడుపును కోసి బిడ్డను అపహరించింది. గర్భిణి చనిపోగా, ఆ బిడ్డ బతికింది.
ఈ కేసులో లిసాను 2007లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. చేసిన నేరాన్ని లిసా అంగీకరించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. ఫెడరల్ కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో లిసా తరపు న్యాయవాదులు ఆమెకు మరణ శిక్ష పడకుండా ఉండేందుకు గట్టిగా వాదనలు వినిపించారు. లిసా మానసిక స్థితి సరిగా లేనందునే ఈ ఘటనకు పాల్పడిందని లాయర్లు కోర్టుకు చెప్పారు. కానీ లిసా హీనమైన చర్యకు పాల్పడిందని కోర్టు న్యాయవాదులను మందలించింది. గత వారమే లిసాకు మరణి శిక్ష అమలు కావాల్సి ఉండే.. అయితే ఆమె తరపు న్యాయవాదులకు కరోనా సోకడంతో జనవరి 12కు వాయిదా వేశారు. ఇండియానాలోని టెర్రె హ్యుటేలోని ఫెడరల్ జైల్లో లిసాకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి శిక్షణను అమలు చేయనున్నారు.
అమెరికాలో చివరిసారిగా 1953లో ఓ మహిళకు మరణ శిక్ష అమలు చేశారు. మిస్సోరిలో ఆరేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసినందుకు గానూ బొన్నై హిడీకి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత ఇప్పుడు లిసాకు ఈ శిక్ష అమలు చేయనున్నారు.













