భారతీయులు ఆ దేశానికి వెళ్లాలంటే … 1000 డాలర్ల ఫీజు!
భారత్, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎల్ సాల్వడార్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై తమ దేశంలోకి రావాలంటే 1000 డాలర్ల ఫీజు కట్టాలని ప్రకటించింది. ఈ మేరకు ఎల్ సాల్వడార్ పోర్ట్ అథారిటీ తమ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ దేశం మీదుగా అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా పశ్చిమార్ధగోళ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బ్రియన్ నికోలస్‌తో ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలి సమావేశమయ్యారు. అక్రమ వలసలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికులపై ఎల్ సాల్వడార్ ఫీజు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.













