అమెరికా ప్రముఖులతో.. జయశంకర్ చర్చలు

కొవిడ్ టీకాల విషయమై అమెరికా సహాయం కోరుతూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఇక్కడ పలువురు ప్రముఖలతో చర్చలు జరిపారు. దీంతోపాటుగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ కూటమి క్వాడ్‍లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా సంప్రదింపులు జరిపారు. డెమొక్రాటిక్ రిపబ్లికన్ పార్టీల చెందిన ప్రభావశీలురైన శాసనకర్తలతో ఆయన భేటీ అయ్యారు. విదేశీ వ్యవహారాల సభా సంఘం చైర్మన్ గ్రెగరీ మీక్స్, ఇండియా కాకస్ చైర్మన్ బ్రాడ్ షెర్మాన్ తదితరులతో చర్చలు జరిపారు. వీరంతా భారత్‍కు అనుకూలురు కావడం విశేషం.
అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ తాయ్‍తోనూ సమావేశమయ్యారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్‍తో భేటీ అయి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నివారణలో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచడం, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడం, పర్యావణ మార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతం సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.