వేలంలో రూ.2.5 కోట్లు పలికిన క్యాప్
క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్.. అరంగేట్రం టెస్ట్‌లో వాడిన బ్యాగీ గ్రీన్ క్యాప్ కు వేలంలో భారీ ధర పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ ఫ్రీడ్మన్ అనే బిజినెస్‌మన్ రూ.2 కోట్ల 50 లక్షలు చెల్లించి ఈ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ వస్తువుల వేలంలో ఇది సెకండ్ హయ్యెస్ట్ ప్రైస్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ క్యాప్‌ను రికార్డు స్థాయిలో రూ.5 కోట్లు 62 లక్షలకు కొనుగోలు చేశారు. 1928 నవంబర్‌లో బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్‌కు క్యాప్‌ను ఇచ్చారు. 1959లో బ్రాడ్‌మన్ ఆ క్యాప్‌ను ఫ్యామిలీ ఫ్రెండ్ పీటర్ డన్హామ్కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో డన్హామ్ను ఈ ఏడాది ఆరంభంలో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించగా, అతని దగ్గర ఉన్న బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను వేలం వేసి ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించాలని ట్రస్టీలు నిర్ణయించారు.













