భారతీయుడిపై సిక్కు మతస్థుడి వివక్ష
వాళ్లిద్దరూ భారతీయ అమెరికన్లు. వారిలో ఒకరు సిక్కు, మరొకరు హిందువు. హిందువును పట్టుకుని డర్టీ హిందూ అంటూ సిక్కు మతస్థుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఈ ఘటన ఆగస్టు 21న కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో జరిగింది. 37 ఏళ్ల తేజిందర్ సింగ్ అనే వ్యక్తి కృష్ణన్ జయరామన్ను అతి దారుణంగా దూషించాడు. జయరామన్పై ఉమ్ము వేసి, అతి దారుణంగా దూషించాడు. హిందువులు అసహ్యకరమైన వారు. గోమూత్రం తాగుతారు. సిగ్గు పడాలి అంటూ విచక్షణారహితంగా మాట్లాడారు. అంతే కాదు. తన చేతి కండలను చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశాడు. తాను ఎదురు తిరిగితే దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన జయరామన్ పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే వచ్చిన ఫ్రీమాంట్ పోలీసులు తేజిందర్ సింగ్ పై పౌర హక్కుల ఉల్లంఘన నేరాన్ని మోపుతూ కేసు నమోదు చేశారు. అసహ్యకరమైన, ద్వేషపూరిత నేరాలను తాము సీరియస్గా తీసుకుంటామని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సియాన్ వాషింగ్టన్ ప్రకటన విడుదల చేశారు. అన్ని మతాలకు చెందిన వారిని రక్షించేందుకే తాము ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల మరొకరు గౌరవభావంతో మసలుకోవాలని ఆయన సూచించారు.













